ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని వదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా వల్ల పదవిని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవినుంచి వైదొలగడానికి రాష్ట్రప్రభుత్వం వర్ల రామయ్యకు నెలరోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీకాలం కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది.
కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019 లో ముగిసినా ఆయన పదవినుంచి స్వచ్ఛంధంగా వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం ఆయనకు నెలరోజులు గడువిస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీఎండీ కృష్ణబాబు తాజాగా నోటీసు జారీచేశారు. అదేవిధంగా విజయవాడ జోనల్ చైర్మన్ పార్థ సారధికి కూడా ఒకనెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులిచ్చింది. ఇదే సమయంలో కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి చేసిన రాజీనామాను ఆర్టీసీ ఆమోదించింది.