ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్ 5 న ఆంధ‌్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు, పూలు, పండ్లు అధికారికంగా సమర్పిస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా 5 వ తేదీన దుర్గమ్మ గుడిలో వీఐపీల దర్శనం రద్దు చేసిన అధికారులు అన్ని క్యూలైన్లను సర్వదర్శనంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఇక ఇంద్రకీలాద్రిపై జరిగే శరన్నవరాత్రులలో ప్రత్యేక ఆకర్షణ..అమ్మవారి తెప్పొత్సవం..విజయదశమి రోజు అంటే అక్టోబర్ 8న కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది.
