ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే పలు సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు జగన్ శ్రీకారం చుడతామంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ కు పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై భారతీయ జనతాపార్టీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకూ రూ. 200 కోట్లు ఆదా అయిందంటే అది ఆహ్వానించదగిన పరిణామమే అన్నారు. తక్కువ వ్యయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామంటే కేంద్రానికి ఏమాత్రం అభ్యంతరం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తుందని, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.