శ్రీవారి బ్రహ్మోత్పవాలకు తిరుమల తిరుపతి ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా..దేశ, విదేశాల నుండి భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవమూర్తులుగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. కాగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి తెలంగాణ రాష్ట్రం నుంచి గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 136 ఏళ్ల నుంచి గద్వాల సంస్థానం వారసులు బ్రహ్మోత్సవాల ప్రారంభయ్యే రోజు తిరుమలేశుడికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. గద్వాల సంస్థాన రాజు శ్రీ కృష్ణరాంభూపాల్‌తో మొదలైన ఈ సంప్రదాయాన్ని వారి వారసులు ఇప్పటికీ పాటించడం విశేషం. వరకు కొనసాగిస్తున్నారు. స్వామి వారికి సమర్పించే ఈ జోడు పంచెలను మండలం రోజుల పాటు ముగ్గురు నేత కార్మికులు నామాల మగ్గంపై నిష్టతో నేస్తారు. వారికి మరో 5 గురు సహకరిస్తారు. ఈ ఏరువాడ జోడు పంచెల తయారీ మొదలు..తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అధికారులకు అందజేసే వరకు నేతకార్మికులు నిత్య పూజలు, గోవింద నామస్మరణతో మగ్గం నేస్తారు. స్వామివారికి బహుకరించే ఈ పంచెలను 11 గజాల పొడవు, 0 అడుగుల వెడల్పు, 13 అంగుళాల అంచు ఉంటుంది. ఇరువైపుల 11 ఇంచుల బోర్డర్‌తో కంచుకోట కొమ్మ నగిషీలతో తీర్చిదిద్దుతారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి శ్రీవారికి సమర్పించే పట్టువస్త్రాలను కేవలం ఉత్సవమూర్తులకే అలంకరిస్తారు. కానీ గద్వాల చేనేత కార్మికులు నేసిన ఈ ఏరువాడ జోడు పంచెలను మాత్రం గర్భగుడిలోని మూలవిరాట్టుకు అలంకరించడం విశేషం. మొత్తంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఏరువాడ పంచెల ధారణ చేయడం గద్వాల చేనేత కార్మికులకు దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి.
