వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేక టాలీవుడ్ లోని అందరూ కంటతడి పెడుతున్నారు. సుమారు 23ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వేణు మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం వేణు ఆకస్మికంగా మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ ఉంటే వేణు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించడానికి వస్తున్నారు.
అయితే వేణుమాధవ్ కు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి మౌలాలివరకూ దాదాపుగా పదిఇళ్లు ఉన్నాయట.. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొన్నారట. సినిమాల్లోకి వెళ్లి నాశనమైపోతావంటూ తండ్రి అంటుండేవాడని అందుకే సంపాదించినప్పుడే హైదరాబాద్ లో పది ఇళ్లు, పదెకరాల భూమి కొని తన భార్యపిల్లలకు, తల్లిదండ్రులకు భోరోసా కల్పించానని వేణు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే ఆయన కుటుంబానికి శ్రీరామరక్షగా మారిందంటున్నారు ఆయన సన్నిహితులు.