రైతు రుణమాఫీకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4,5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38ని రద్దు చేసింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. 4, 5 విడతల రైతు రుణమాఫీకి సంబంధించిన సొమ్మును 10 శాతం వడ్డీతో కలిసి దాదాపు 31 లక్షలా 45వేల రైతులకు 8వేల 2 వందల కోట్లు విడుదల చేస్తూ మార్చి 10న టీడీపీ ప్రభుత్వ జీవో 38 విడుదల చేసింది. అందులో కొందరు రైతుల అకౌంట్లలోనే అప్పట్లో డబ్బు జమ చేశారు.
ఆసమయంలో ఎన్నికల కోడ్ రావడంతో నిధుల చెల్లింపులు నిలిపివేసారు. అయితే చంద్రబాబు తానిచ్చిన హామీని నెరవేర్చకుండా ఐదేళ్లపాటు కాలయాపన చేసారు. ఆ విధంగా 31లక్షలమంది రైతులకు 7 వేల 582కోట్లు జమ కాలేదు. ఎన్నికలతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల రుణమాఫీని పూర్తిచేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు సీఎంను కోరారు. దీనిపై కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే పథకం అమలులో ఉంటే రుణమాఫీ వర్తింపచేయాలని కోర్టు సూచించింది. అయితే చంద్రబాబు 2014లో అధికారం చేపట్టి ఒక్కో రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ 55 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు 24 వేల 5 వందల కోట్లు మాఫీ చేస్తామన్నారు బాబు. కానీ 50 వేలకు మించి చేయలేదు. అందులో 55 లక్షల మంది రైతులకు కేవలం 7 వేలకోట్లు మాత్రమే మాఫీచేశారు.