టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విశాఖ జిల్లాలో టీడీపీ త్వరలోనే ఖాళీ కానుంది. ముఖ్యంగా చంద్రబాబు తీరుపై విసుగెత్తిన తెలుగు తమ్ముళ్లు..తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో టీడీపీ కీలక నేత, విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అడారి ఆనంద్‌కుమార్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి తదితరులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు..సన్యాసిపాత్రుడు దసరా పండుగకల్లా వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరటం దాదాపుగా ఖాయమైంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు చేతిలో పంచకర్ల రమేష్‌బాబు ఓడిపోయారు. ఎన్నికల తర్వాత స్థానికంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రమేష్‌బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు..ఈ మేరకు వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగనాడు వందలాది మంది అనుచరులతో పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిని పంచకర్ల కలవడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని విశాఖలో చర్చ జరుగుతోంది. వైసీపీలో చేరే విషయం స్వామిజీకి చెప్పి పంచకర్ల ఆశీస్సులు తీసుకున్నట్లు సమాచారం. కాగా 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి నుండి పోటీ చేసి గెలుపొందారు. 2014లో గంటాతో కలిసి టీడీపీలో చేరిన పంచకర్ల యలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో మాత్రం ఓటమి చవిచూశారు. మారిన రాజకీయ పరిణమాల నేపథ్యంలో ముఖ్యంగా అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై విసుగెత్తిన పంచకర్ల వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డితో పంచకర్ల చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అనుమతి ఇస్తే..ఇప్పటికిప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలతో సహా టీడీపీ కీలక నేతలు పదిమంది వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పంచకర్ల చెబుతున్నారు. మొత్తంగా విశాఖ జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం రాజకీయంగా కలకలం రేపుతోంది. దసరా కల్లా టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని
విశాఖ జిల్లాలో చర్చ జరుగుతోంది.
