త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికపైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తాము చేయించుకున్న సర్వేలో టీఆర్ఎస్ వైపు 55 శాతం, కాంగ్రెస్ వైపు 41 శాతం మంది ఉన్నారని తేలిందని ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం… మెజార్టీ ఎంతనేది ఫలితాలు రోజు చెబుతానని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు లేకపోతే ఆనాడే ఉత్తమ్ ఓడిపోయేవారని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు మాత్రమే లాభమని… టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్ నగర్‌కే లాభమని అన్నారు. హుజూర్ నగర్‌లో తమకు ఎలాంటి ప్రతికూల అంశాలు లేవని కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్ ప్రజలకు క్లారిటీ ఉందని… మరో నాలుగేళ్లు అధికారంలో ఉండబోయేది తామే కాబట్టి… వాళ్లు తమకే ఓటు వేసి గెలిపిస్తారని భావిస్తున్నానని అన్నారు. హుజూర్ నగర్‌లో తమకు పోటీ కాంగ్రెస్‌తో తప్ప బీజేపీతో కాదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయించిన 30 మంది ఇంఛార్జ్‌లు రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని కేటీఆర్ అన్నారు.
