ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. తమిళనాడులో కోటికి పైగా సభ్యుత్వాన్ని నమోదు చేయాలని నిర్దేశించారు.
ప్రధాన నగరాల్లో బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆవెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆఎన్నికలకు రజనీ దూరంగా ఉన్నారు. ఈ ఘటన అభిమానుల్ని నిరాశ పరచింది. శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని రజనీ నిర్ణయించుకున్నారట. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న రజనీ ఇప్పటివరకూ పార్టీని ప్రారంభించలేదు. పార్టీ జెండా, అజెండా కూడా లేదు. ఇలాంటి తరుణంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీకాంత్ భేటీ అవడంతో ఇపుడు తమిళ రాజకీయం వేడెక్కింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదికి ప్రశాంత్ కిశోర్ పనిచేయగా ఆ ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. అలాగే ఏపీలో2019 ఎన్నికలలకు వైసీపీకి వ్యూహకర్తగా పీకే పనిచేశారు. ఇక్కడా వైసీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు పార్టీల దృష్టి పీకేపై పడింది.
దీంతో తమిళనటుడు, మక్కళ్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహసన్ ప్రశాంత్‌కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆయనతో చర్చలు జరిపి, రాజకీయపరంగా పార్టీలో మార్పులు చేస్తున్నారు. పార్టీకి నాయకులు లేని నియోజక వర్గాల్లో నాయకులను నియమించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదేబాటలో రజనీ ముంబైలో ప్రశాంత్ కిశోర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పీకే తన బృందంతో చేయించిన సర్వే వివరాలుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రజనీకాంత్ ప్రశాంత్‌కిశోర్‌తో భేటీ కావడంతో కమల్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ ఇప్పుడు రజనీకాంత్ పార్టీకి తన సేవలను ఎలా అందిస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది. కమల్ కు హ్యాండిచ్చి రజినీ జెండానే పీకే గెలిపిస్తారని తమిళ ప్రజలు చెప్పుకుంటున్నారు.