తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, పడికావలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామాగ్రి, ప్రసాద ప్రాంగణం, పోటు ప్రాంతాన్ని నీటితో శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి పూర్తైన తర్వాత నాముకోపు, కస్తూరి, గడ్డ కర్పూరం, గంధం పొడి, శ్రీ చూర్ణం, పచ్చాకు వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం సందర్భంగా మంగళవారం నాడు మధ్యాహ్నం వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రసాదం నివేదన తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు విధిగా జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం ఘనంగా పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అశోక్ సింఘాల్, ఆలయ పూజారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
