ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్..ఇవాళ అనారోగ్యంతో యశోదా హాస్పిట్లో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణలో కోదాడ వంటి చిన్నపట్టణంలోని ఓ సాధారణ మధ‌్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణుమాధవ్ తొలుత మిమిక్రీ కళాకారుడిగా, తర్వాత టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్..ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించి తనదైన హాస్యంతో మెప్పించిన కమేడియన్ వేణుమాధవ్ మరణించడంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భాంతి చెందింది. కాగా వేణుమాధవ్‌కు పొలిటికల్‌గా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. కోదాడలో మిమిక్రీ కళాకారుడిగా రాణిస్తున్న వేణుమాధవ్‌ను ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే చందర్రావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీసులో చిన్న జీతానికి పని చేసిన వేణుమాధవ్ తర్వాత ఎన్టీఆర్ సమక్షంలో మహానాడులో మిమిక్రీ చేసి ఆకట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో కూడా వేణుమాధవ్‌కు టీడీపీతో అనుబంధం కొనసాగింది. నంద్యాల ఉప ఎన్నికలలో వేణుమాధవ్ టీడీపీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను, కోరుకున్న సక్సెస్‌ను సాధించిన వేణుమాధవ్..రాజకీయాల్లో మాత్రం తానుకోరుకున్నది సాధించలేకపోయారు. వేణుమాధవ్‌కు తన స్వస్థలం కోదాడ అంటే వల్లమాలిన అభిమానం. తన ప్రతి బర్త్‌డేకు కేక్ కట్ చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆ ఖర్చుతో కోదాడలో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. తన అభిమానులు, స్నేహితులు కూడా ఆయన బర్త్‌డేకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. తనను ఆదరించి, ప్రోత్సహించిన కోదాడ ప్రజలకు సేవ చేయాలని వేణుమాధవ్ భావించేవాడు. అందుకోసం ఎమ్మెల్యే కావాలనే తపనతో వేణుమాధవ్ బాబుతో ఉన్న పరిచయంతో టికెట్ కోసం ప్రయత్నించాడు. అయితే చంద్రబాబు మాత్రం వేణుమాధవ్‌ను టికెట్ విషయంలో పరిగణనలోకి తీసుకోకపోయేవాడు. పాపం వేణుమాధవ్‌కు ఎమ్మెల్యే అయి కోదాడ ప్రజలకు సేవ చేయాలని ఎంతగానో పరితపించేవాడు. కానీ రాజకీయంగా ఆ అవకాశం దక్కలేదు. అలా తీరని కోరికతోనే వేణుమాధవ్ ఈ లోకం నుంచి వెళ్లిపోవడం బాధాకరం. తనదైన హాస్యంతో తెలుగు ప్రజలకు కితకితలు పెట్టిన నల్లబాలు అలియాస్ వేణుమాధవ్‌కు దరువు.కామ్ అశ్రునివాళులు అర్పిస్తోంది.