ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్.జగన్
అన్నారు. 208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించకోకూడదని దీనికోసం మినహాయించుకోలేని రీతిలో అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఆర్థికశాఖతో టచ్‌లో ఉండి వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిద్దామన్నారు. అలాగే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నావడ్డీ చెల్లింపును రశీదు రూపంలో వారికి అందిస్తారన్నారు.
ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలని, చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, వారికిచ్చే ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వచ్చి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరమన్నారు. వర్షాలు బాగా పడ్డాయి, రిజర్వాయర్లలో నీళ్లుకూడా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందని ఈమేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉడడంతో పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారని,
పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం లేదన్నారు.
విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నామని దీనికి మీ అందరి సహకారం కావాలన్నారు.