హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. వేణు మాధవ్ బుధవారం హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు. వేణు మాధవ్ అకాల మరణంపై చిరంజీవి కూడా దిగ్ర్భాంతి వ్యక్తంచేసారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తొలిసారి తనతోకలిసి మాస్టర్ సినిమాలో నటించాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
తర్వాత చాలా సినిమాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడని, కొన్నిపాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా వేణు నటించేవాడని చిరంజీవి అన్నారు. తాను నటించే పాత్రలకే వన్నే తీసుకొచ్చేవాడని, వయసులో చిన్నవాడు అయినా తెలుగు సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్ ఉందనుకునే వాడినన్నారు. అయినా వేణుని దేవుడు చిన్న చూపు చూసాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నానన్నారు చిరంజీవి.