ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18లక్షలమంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న మీరు ఇప్పటివరకూ గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ అంశంలో ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు.
సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయంలో ప్రభుత్వం గానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలు తాము నిర్వహించలేదు, తమకు సంబంధం లేదంటుందని మరి 18లక్షలమంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఏంటీ నాటకాలంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎవరో వచ్చి టీడీపీ ఓర్వలేక పోతుందని ప్రకటనలు ఇస్తున్నారంటూ విమర్శించారు. ఓర్వలేకపోవడానికి మీరుచేసిన ఘనకార్యాలేంటో చెప్పాలి అన్నారు. ముందు ఈ స్కామ్‌పై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. యువతకు మీరు చేసిన అన్యాయాన్ని సహించేది లేదని హెచ్చరించారు. గత టీడీపీ హయాంలో ఇసుక రేటెంత, ఇప్పటి వైసీపీ పాలనలో ఇసుక రేటెంత అంటూ ప్రశ్నించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఐదువేల ఉద్యోగాలు ఇవ్వలేని మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, తమరి హయాంలో మాదిరిగా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని ప్రస్తుత ఇసుక పాలసీలో తప్పొప్పులు ఉంటే సరిచేసుకుంటామన్నారు.