Home / ANDHRAPRADESH / కట్ట – కరకట్ట – ఎట్టెట్టా ?

కట్ట – కరకట్ట – ఎట్టెట్టా ?

హరప్పా మొహంజదారో సింధూ నాగరికత నుండీ మానవేతిహాసంలో ఏ నాగరికత అయినా నదిపక్కన పుట్టాల్సిందే . నైలు నది జీవనమెట్టిది ? అని శ్రీ శ్రీ కూడా ప్రశ్నించినట్లున్నాడు . సాధారణంగా మనలాంటివారు చరిత్రను చదువుతాం . కొందరు చరిత్రను నిర్మిస్తారు . మరికొందరు చరిత్రను ధ్వంసం చేస్తారు . అసలిప్పుడు పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకుతప్ప మిగతావారికి చరిత్ర అంటరానిది .
గోదావరి , కృష్ణ రెండు పెద్ద నదులు మనరాష్ట్రంలో పుట్టకపోయినా పొనీలేపాపం అని మనరెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నాయి . ఉప్పొంగే జీవజాలాలు ఉప్పుసముద్రంపాలు అన్న ఆరుద్రమాట ప్రకారం మనసముద్రతీరంలోనే రెండునదులు మునిగి ఉనికిని కోల్పోతున్నాయి .

ఎప్పుడు ఎడతెగక పారే ఏరు పక్కన ఉండడం చాలా శ్రేష్టం అని శతకకారుడు చెప్పాడు . తూర్పున , లేదా ఉత్తరాన పారే నీళ్లకు ఎదురుగా ఇల్లుకట్టుకుంటే హరిహరబ్రహ్మలు కట్టకట్టుకుని వచ్చినా ఆ ఇంట్లో ఉన్నవాళ్లను అంగుళం కదల్చలేరని వాస్తు చెబుతోంది . ఆ శతకం , ఈ వాస్తు విజయవాడ కరకట్టమీద గుడికట్టుకుని గుజ్జనగూళ్లు ఆడుకుంటున్నాయి . అసలు కరకట్ట అంటేనే నీళ్లను ఆపడానికి . నీటిపారుదల అద్భుతాల్లో ఎవరెస్టును ఎడమకాలితో తన్నేలాంటి అద్భుతం కరకట్ట దగ్గర ఉంది . కరకట్టకు ఆవల పొలాలు ఉంటాయి . ఈవల నదిలోపలికి ఇళ్లు , కలవారి విడిది సత్రాలు , రిసార్టులు , ప్రకృతి చికిత్సవిచికిత్సల ఆకాశ హర్మ్యాలు ఉంటాయి .

అనుమతులు మతులు సమ్మతులు సుతులు హితులు అంతా నీటిమీద రాతలు . ఇక్కడే భాషా సౌలభ్యం గొప్పగా ఉపయోగపడుతుంది . తెలుగుభాషకు ప్రాచీన హోదా రాకుండా తమిళులు అడ్డుపడ్డారని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం . తెలుగు నవీన భాషలో ఏ మాటకు ఏ అర్థమో మనలో మనమే ఒక క్లారిటీకి రాలేకపోతున్నాం.

కట్టకు కరకట్టకు స్పష్టమయిన అర్థాలు ఏమిటి ? నిర్వచనాలు నిర్దిష్టంగా ఉన్నాయా ? ఉంటే శ్సబ్దరత్నాకరంలో ఉంటాయా? లేక నీళ్లపాలయిన నీటిపారుదల నిఘంటువులో ఉంటాయా ?
నీళ్ల పారుదల , నీళ్ల పొంగు , నీళ్ల ప్రవాహం , ఉప్పెన , వరద అంతా ఒకటేనా ? వేరువేరా ? ఇది చెలియలికట్ట లాంటి కావ్యాలు రాసిన విశ్వనాథవంటి భాషా పండితులు తేల్చాల్సిన విషయమా ? సర్ ఆర్థర్ కాటన్ సిగ్గుపడాల్సిన ఆధునిక నీటిపారుదలనిపుణులు నిర్ణయించాల్సిన విషయమా ?

కాళ్లు కడుక్కోవడానికి మనలాంటి సామాన్యులు బాత్ రూమ్ లో బక్కెట నీళ్లు , ఒక మగ్గు పెట్టుకుంటాం . విజయవాడ కరకట్ట దగ్గర కలవారు కాళ్లు కడుక్కోవడానికి కృష్ణా నదిని కట్టేసుకున్నారు . ఇది అంతర్జాతీయ నదీవిహార విశృంఖల జలవిలయ ఒప్పందం ప్రకారం పెద్ద తప్పు కాదు . అందునా పెద్దలు చేస్తే అసలు తప్పే కాదు . నిజానికి కృష్ణకు కరకట్ట అక్రమనిర్మాతలకు మధ్య నీటిమీద రాసుకున్న ఒప్పందమిది . మాటలు నీటిమూటలు అన్న ఒక్క సూత్రం ప్రకారం ఎంత వెతికినా సీ ఆర్ డి ఏ వారికి ఈ ఒప్పంద పత్రం అసలుకానీ , కనీసం నకలుకానీ దొరకడంలేదు .

నీళ్ల నిర్వచనాలే ఇంత సంక్లిష్టమైన వేళ , ఇప్పుడు తెలుగు భాషకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి . అద్దె చెల్లించకపోయినా అద్దె ఇల్లు అనవచ్చా ? ఇంటి యజమాని అద్దెగా భావించినది , ఇంట్లో ఉన్న ఆసామి ఉచితం అనుకున్నప్పుడు భాషలో ఈ ఒప్పందానికి మాటలేకపోవడం తెలుగుకు ప్రాచీనహోదా సాధించడానికి అడ్డుకాదా ? తక్షణం తెలుగు భాషా ప్రేమికులు , వ్యాకరణ పండితులు కూర్చుని ఒక మాట అనుకోకపోతే తమిళుల ముందు తలయెత్తుకుని ఎలా నిలబడగలుగుతాం ?

అధికార నివాసానికి , విడిది ఇంటికి తేడా ఏమిటి ? నిర్వచనాలేమిటి ? అన్నది స్పష్టత రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేపు రెంట్ కంట్రోల్ ప్రత్యేక న్యాయస్థానాలు కేసులతో నిండిపోతే అంతర్జాతీయంగా మన పరువేమికాను ? ఒక నిస్సహాయ భాషా ప్రేమికుడిగా , ఆంధ్రప్రదేశ్ నేలమీద పుట్టినవాడిగా నా అభ్యర్థన . వ్యాకరణ పండితులు , మాండలిక భాషాశాస్త్రవేత్తలు ,  తెలుగు తెలిసిన నీటిపారుదల నిపుణులు , వాస్తు విజ్ఞులు , అనువాదకులు , న్యాయనిపుణులు , సమాజ హితం కోరే అందరూ కరకట్టమీద వెంటనే కూర్చుని భాషకు , కృష్ణకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను . కేవలం ఈ ఒక్క ప్రయత్నంతో అక్రమ నిర్మాణాల మాట ఎలా ఉన్నా , తెలుగుకు ప్రాచీన హోదా వచ్చితీరుతుందని నా ఆశ . దయచేసి నా ఆశమీద కృష్ణ కరకట్ట నీళ్లు చల్లకండి .

-పమిడికాల్వ మధుసూదన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat