జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో చూద్దాం.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్టు సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారు. ఇవి చాలా రకాల్లో ఉంటాయి. ఓపెన్ టెండర్, బిడ్డింగ్ సహా పలు పద్ధతుల్లో టెండర్లు వేస్తారు.. ఇటీవల ఆన్ లైన్ లో టెండర్లు నిర్వహిస్తున్నారు.
ఒకసారి ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థకు అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఏకారణం వల్ల అయినా అసంతృప్తి చెందితే పాత టెండర్లు రద్దు చేయొచ్చు. మళ్లీ టెండర్లు పిలవడానికి ఏ విధానమైనా అవలంభించొచ్చు. కానీ పాత పద్ధతిలోనే, అదే కాంట్రాక్టుని, అంతకన్నా తక్కువకు నిర్ణయించి మళ్లీ టెండర్లు పిలవడాన్నే రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయనే నిర్ధారణకు రావడం లేదా ఆ పనిని మరింత తక్కువ డబ్బుతో నిర్వహించడానికి అవకాశాలున్నాయనే అభిప్రాయానికి రావడంతోనే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా పిలిచారు. దేశంలోనే ఇప్పటివరకూ రివర్స్ టెండరింగ్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించలేదు. కానీ జాతీయస్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పోరేషన్ వంటి సంస్థల్లో ఇది అప్పుడప్పుడూ అమలవుతోంది.
ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా పోలవరం ప్రాజెక్టుతో రివర్స్ టెండరింగ్‌కి శ్రీకారం చుట్టారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును భావిస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం సహా అనేక ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేశారు. చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేసిన తర్వాతే తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగానే పోలవరం పనుల పరిశీలనకు ఓ కమిటీని నియమించి నివేదిక రూపొందించారు. దాని ప్రకారం మొత్తం రూ.2,500 కోట్ల అవినీతి జరిగడంతో దానిని సరిచేయడం కోసం రివర్స్ టెండరింగ్ ప్రారంభించారు. పోలవరం ప్రధాన రీటెండర్లో ఏపి ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా రావడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.