తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కే.చంద్రశేఖర్‌రావులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితోసపాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సీఎంలిద్దరూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మేలు కొరకు జరిగిన ఈ భేటీపై ఎల్లో మీడియా విషం కక్కింది.
కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో కధనం ప్రచురితమైంది. ఈ కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టంచేసింది. ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో సదరు మీడియాకు హితవు పలికింది. ఈవిషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని కూడా ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని సీఎంఓ ప్రకటించింది. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు సీఎంల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టంచేసింది.