ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ సంస్థలకు కుదించిన టారిఫ్ ప్రకారం చెల్లింపులు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని కచ్చితంగా 6 నెలల్లోపు పరిష్కరించాలని హైకోర్టు ఈఆర్సీని ఆదేశించింది. ఇఫ్పటి వరకూ నిర్ణయించిన ధరప్రకారం బకాయిలను వెంటనే చెల్లించాలని, వివిధ కారణాలతో విద్యుత్ తీసుకోవడం నిలిపివేసిన సంస్థలనుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జగన్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాక విద్యుత్ కొనుగోలు చేయబోమని ఉత్పత్తి సంస్థలకు చెప్పడమేమిటని ప్రశ్నించింది. అంటే తమ ఆదేశాలంటే మీకు లెక్కలేదా.? మేం ఊం చెప్పినా ఇంతేనా? అంటూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.