ఇవాళ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసమైన ప్రగతి భవన్‌కు వెళతారు. ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు – అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగ్ అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్ విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై ప్రధానంగా ఇరు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు రాష్ట్రాల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు, రాజకీయపరంగా ఏమైనా చర్చలు జరగుతాయో అన్న కోణంలో రాజకీయ, మీడియా వర్గాలు ఇద్దరు సీఎంల మీటింగ్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. శ్రీశైలంకు గోదావరి జలాల తరలింపు, యురేనింపై తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం తదితర అంశాలపై కూడా ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
