చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ మరణం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. పార్టీ కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎంతో నిబద్దతతో పని చేసిన శివప్రసాద్‌ను వ్యకిగతంగా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. . నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన శివప్రసాద్ ఆజాతశత్రువుగా పేరుగాంచారు. కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్నా..శివప్రసాద్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్నేహంగా వ్యవహరించేవారు. టీడీపీ తరపున తన వాదనను బలంగా వినిపిస్తూ, ప్రత్యర్థులను తనదైన స్టైల్లో విమర్శించే శివప్రసాద్ వ్యక్తిగతంగా పార్టీలకతీతంగా అభిమానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాను సినిమాల్లోకి పరిచయం చేసింది శివప్రసాదే. అలాగే రోజాను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది కూడా ఆయనే. తదనంతరం రోజా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. చంద్రబాబుతో సహా ఇతర టీడీపీ నేతలపై మాటల తూటాలు పేల్చే రోజా శివప్రసాద్‌ను మాత్రం ఎంతో గౌరవించేది. ఇక చిత్తూరు జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డితో కూడా శివప్రసాద్‌కు వ్యక్తిగతంగా మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఆదివారం నాడు శివప్రసాద్ భౌతికకాయానికి నివాళి అర్పించిన మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్ అకాల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని – ఆయన ఆత్మకు శాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తనను శివప్రసాద్ అన్నయ్యా అంటూ ప్రేమతో పలకరించేవారని – అటువంటి మిత్రుడిని తాను కోల్పోయానని పెద్దరెడ్డి ఆవేదన చెందారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను పరామార్శించిన పెద్దిరెడ్డి భావోద్వేగంతో కన్నీళలు పెట్టుకున్నారు. టీడీపీ నేత మరణిస్తే..వైసీపీ మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి..శివప్రసాద్ రాజకీయాలకు అతీతంగా అందరి మనసులను గెల్చుకున్న గొప్ప నేత అని…ఆయన అభిమానులు అంటున్నారు.