చిత్తూరు మాజీఎంపీ, టీడీపీ సీనియర్ నేత, నటుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు శివప్రసాద్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియల ఏర్పాట్లను రాజకీయాలకు అతీతంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో అభిమానులు, పార్టీనేతలు తరలివచ్చి శివప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో పార్లమెంట్‌లో వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహించి తెలుగుగళాన్ని పార్లమెంటులో వినిపించిన ఖ్యాతి ఆయనకే దక్కిందని పలువురు అన్నారు.
మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ శివప్రసాద్ అజాత శత్రువు అని, రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి అన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను అన్ని విధాలుగా అండగా వుంటానని ఓదార్చారు. ‘చిన్నప్పుడు నుంచి మంచి మిత్రుడు.. కలిసి చదువుకున్నాం.. ఆయన డాక్టర్ అయ్యాడు, నేను ఎకనామిక్స్ లో పీజీ చేశాను. శివప్రసాద్ సినిమా ఇండస్ట్రీపై ఎనలేని ప్రేమను పెంచుకుని యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, నటుడిగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని నేను ఆయన్ను ఆహ్వానించడంతో మాస్నేహం, నమ్మకంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారన్నారు. శివప్రసాద్ మంచి రచయిత కావడంతో పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, కార్యకర్తలను ఉత్తేజితులను చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందించారన్నారు. అయితే శివప్రసాద్ భౌతిక కాయాన్ని చెవిరెడ్డి మోస్తూ తన గురువు గారితో తనకున్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకోవడం అక్కడివారిని కంటతడి పెట్టించింది.