వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల జల్లు కురిపించారు. ఒకరకంగా సునామీ అనాల్సిందే. ఆ రేంజ్లో చిరంజీవిని పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, అగ్రదర్శకులంతా హాజరయ్యారు. ఈ వేదికపై పృథ్వీ మాట్లాడుతూ సైరాలో నాది మాధవయ్యర్ పాత్ర.. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను (చిరంజీవి) కలిస్తే క్యారెక్టర్ ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికి వస్తుందిరా.. నీకు దక్కింది.. డూ ఇట్ డూ యువర్ బెస్ట్ అని ప్రోత్సహించారు. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా చిరంజీవి రుణం తీరదని, ఈ అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నానన్నారు.
నాకు ఇది ఆస్కార్ అవార్డుతో సమానమన్నారు. ఈ సినిమాలో అన్నయ్య గొప్పదనం గురించి చెప్పే అద్భుత క్యారెక్టర్ తనతో చేయించారని, ఈ క్యారెక్టర్ నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. జీవితంలో ఈ క్యారెక్టర్ ఒక్కటే చాలు.. ఇంకా సినిమాలు చేయకపోయినా ఫర్వాలేదు. ఆ తిరుమల వెంకన్న ఆశీస్సులు మెగాస్టార్‌కి ఉండాలని. అన్ని భాషల్లోనూ సైరా సినిమా రికార్డులు బద్దలు కొట్టాలిని ఆయన ఓ రేంజ్ లో చిరంజీవిని ఆకాశానికెత్తారు. అయితే మొదటినుంచీ చిరంజీవంటే పృద్వీకి ప్రాణమట.. అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయతగా ఉంటారట. అలాగే రాజకీయాలకు అతీతంగా చిరంజీవిని అభిమానించారు. పవన్ ను రాజకీయంగా విమర్శించారే తప్ప ఏనాడూ చిరంజీవిపై పృద్వీ విమర్శలు చేయలేదు.