పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని హైవేపై కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగాయాలై రక్తపుమడుగులో పడిఉన్నాడు. అయితే అప్పటికే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి రోడ్డు ప్రమాదంపై సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనాస్థలికి వెళ్లిమరీ క్షతగాత్రుడిని పరీక్షించారు. అంబులెన్స్‌ను రప్పించి మరీ బాధితుడికి ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. అంబులెన్స్ లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో శ్రీదేవి క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేశారు. గాయాన్ని తుడిచి కట్టుకట్టారు. ఇంజెక్షన్ ఇచ్చారు. తలకు గాయాలైనందున.. ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా సూచించారు. ఎమ్మెల్యే శ్రీదేవి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. . ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు.