రాష్ట్రవిభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా సమాధి అయిపోయింది. బొత్స, ధర్మాన, మోపిదేవి వంటి నేతలంతా జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు జగన్ కాంగ్రెస్‌ను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడే..చాలా మంది నేతలు ఆయన వెంట నడిచారు. 2014లోనే కాంగ్రెస్ భూస్థాపితం అయింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితిలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాడి వదిలేశాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ క్యాడర్..వైసీపీలో కలిసిపోయింది. దీంతో ఆ పార్టీలో మిగిలిన కొంత మంది నాయకులు రాజకీయాలకు దూరంగా ఇంటికి పరిమితం అయితే..మరి కొందరు రాజకీయాలు వీడలేక…కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..ఏదో అలా బండిలాగిస్తున్నారు. ఇక మోదీ దెబ్బకు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్ల వరకు కోలుకోలేని పరిస్థితి. స్వయంగా అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వ బాధ్యతలు నుంచి పారిపోతే..తీవ్ర అనారోగ్యంతో ఉండి కూడా సోనియాగాంధీ పార్టీని నడిపించాల్సి వచ్చిన ఖర్మ పట్టింది. మొత్తంగా దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో ఆ పార్టీలో మిగిలిన ఒకరిద్దరు నాయకులు త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా టి. సుబ్బరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో కళాబంధుగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా పేరున్న టి. సుబ్బరామిరెడ్డి వివాదరహితుడు. పార్టీలకతీతంగా అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు ఇప్పుడు రాజకీయంగా ఏ పదవి లేదు. ఒకప్పుడు రాజ్య సభ సభ్యుడిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవడంతో టి. సుబ్బరామిరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు వెళ్లాలన్నది సుబ్బారామిరెడ్డి కోరిక. ఈ మేరకు వైసీసీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా టి. సుబ్బరామిరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌కు అ్యత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో టి. సుబ్బరామిరెడ్డి చేరిక పట్ల వైసీపీ కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సీనియర్ కాంగ్రెస్ నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. టి. సుబ్బరామిరెడ్డి వంటి ఆర్థికంగా బలమైన కాంగ్రెస్ నేత.. వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు..ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.