ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత , మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన కమలాకర్ రెడ్డి ఇవాళ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కమలాకర్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన కమలాకర్ వైసీపీలో చేరడంతో టీడీపీ ఖాళీ కానుంది. ఇప్పటికే నెల్లూరులో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. ఇక మాజీ మంత్రి సోమిరెడ్డి ఫోర్టరీ కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్నాడు. మరోపక్క చంద్రబాబు ఆడుతున్న వరుస డ్రామాల పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాకముందే కేవలం బురద జల్లాలనే ఉద్దేశంతో రాజధాని, పల్నాడు గొడవలు, కోడెల ఆత్మహత్యపై వరుసగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబును టీడీపీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కీలక నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న కమలాకర్‌రెడ్డి తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరడంతో నెల్లూరు రూరల్‌లో టీడీపీ దాదాపుగా ఖాళీ అయింది. ఇప్పటికే ఫోర్టరీ కేసులో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్న సోమిరెడ్డికి పార్టీలో కీలక నేత అయిన కమలాకర్ వైసీపీలో చేరడం ఇబ్బందికరంగా మారింది.