చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెన్నైకు వెళ్లి శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే ఆరోగ్యంతో కోలుకుంటారని భావిస్తున్న టీడీపీ శ్రేణులకు ఇవాళ ఆయన మరణవార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. 1951 జూలై 11 న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించిన శివప్రసాద్…వైద్యుడిగా సేవలందిస్తూ…సినీ రంగంలోకి అడుగుపెట్టారు. శ్రీ ఆంజనేయం వంటి ఎన్నో సినిమాల్లో శివప్రసాద్ మంచి పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2006లో డేంజర్ మూవీలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు దక్కించుకున్నారు. కాగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివప్రసాద్ టీడీపీ నుంచి రెండు సార్లు చిత్తూరు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్లమెంట్లో రకరకాల గెటప్పులు వేస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ..ఇవాళ చెన్నైలో మరణించారు. టీడీపీ సీనియర్ నేత కోడెల చనిపోయి వారం రోజులు కూడా కాకముందే మరో టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ మరణించడంతో టీడీపీ శ్రేణులు శోక సంద్రంలో ముగినిపోయాయి. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ…అశ్రునివాళులు అర్పిస్తోంది మా దరువు.కామ్.
