మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నేత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త…టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూత్రపిండ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోల్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల తర్వాత కూడా శివప్రసాద్ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదని డాక్టర్లు చెబుతున్నారు. శివప్రసాద్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు మరికాసేపట్లో చెన్నైకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు శివప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శివ ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉందని తెలియడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తమ నాయకుడి గురించి ఏ క్షణంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని తెలుగు తమ్ముళ్లు టెన్షన్‌తో ఉన్నారు. కాని శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని, త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.