ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. గత ఆదివారం ఉదయం..చనిపోవడానికి ముందు.. 24 నిమిషాల పాటు బసవతారకం ఆసుపత్రికి చెందిన ఓ లేడీ డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసిన పోలీసులు..ఆయన కాల్ డేటా వివరాలను సేకరించారు. అయితే మిస్సింగ్ అయిన కోడెల ఫోన్ మాత్రం ఇంకా దొరకలేదు. ఆదివారం నాడు కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ముందు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు పది నుంచి 12 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తెలిసిన వారితో ఒకటి రెండు నిమిషాలు మాట్లాడారని తెలుస్తోంది. ఇక చివరి కాల్ మాత్రం గన్‌మెన్ ఆదాబ్‌కు చేసి కేవలం 9 సెకన్ల మాత్రమే మాట్లాడారని పోలీసుల విచారణలో తేలింది. గన్‌మెన్‌తో చివరగా కోడెల ఏం మాట్లాడారనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. దర్యాప్తులో భాగంగా కోడెల కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో పని చేసేవారిని, ఆయన వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కోడెల ఇంట్లోని కొన్ని వస్తువులను సీజ్ చేసిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధం కానున్నారు. ఇదిలా ఉంటే కోడెల గదిలో కొన్ని టాబ్లెట్స్ కూడా గుర్తించారని తెలుస్తోంది. అక్కడ లభ్యమైన మెడిసిన్స్, మందుల చీటీలును కూడా సీజ్ చేసి, పరీక్షల నిమిత్తం పంపించారు. ఆత్మహత్యకు ముందు గంట సేపు కోడెల 12 కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు..ఎవరెవరి నుంచి ఆయనకు ఫోన్లు వచ్చాయనే కోణంలో సదరు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తులను గుర్తించి పోలీసులు ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా కోడెల ఫోన్ కాల్‌డేటా వివరాలు సంచలనంగా మారాయి. ఈ 12 కాల్స్ మాట్లాడిన వారిని ప్రశ్నిస్తే కోడెల ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉంది.