వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ కేసులో రిమాండ్ ముగిస్తోంది. దీంతో బెయిల్‌కు ప్రయత్నిద్దామనుకున్న చింతమనేనికి ఏలూరు పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రస్తుతం జైలులో ఉన్న చింతమనేనిని మరో కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు పరిశీలించిన న్యాయమూర్తి అక్టోబర్ 1 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని తిరిగి జిల్లా జైలుకు తరలించారు.
ఇంతకీ ఈ కేసు ఏమింటంటే గత నెలలో ఎస్సీ, ఎస్టీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వచ్చారు. అయితే సినీ ఫక్కీలో వారి కళ్లు గప్పి, పారిపోయిన చింతమనేని రెండు వారాల పాటు అజ్ఞాతంలో గడిపాడు. పోలీసులు 12 టీమ్‌లుగా విడిపోయి చింతమనేనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు సెప్టెంబర్ 11 న అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు చింతమనేని దుగ్గిరాలలోని ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో 5గురు మహిళా పోలీసులు కూడా ఉన్నారు. చింతమనేని ఆదేశాలతో ఆయన అనుచరులు ఆ 5 గురు మహిళా పోలీసులను బూతులు తిడుతూ తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చింతమనేని అనుచరుల బారి నుంచి కాపాడారు.
కాగా చింతమనేని తన అనుచరులను తమపైకి ఉసిగొల్పాడని, తమను బూతులు తిడుతూ..ఓ గదిలో బంధించి వేధించారంటూ..ఆ 5 గుర్తు మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు జైలులో ఉన్న చింతమనేనిని అరెస్ట్ చేసి మళ్లీ కోర్ట్‌ముందు హాజరపర్చగా…న్యాయమూర్తి అక్టోబర్ 1 వరకు రిమాండ్ విధించారు. దీంతో మరో 5 రోజుల్లో బెయిల్‌పై బయటకు వద్దామనుకున్న చింతమనేనికి పోలీసులు షాక్ ఇచ్చినట్లైంది. ఇక చింతమనేనిపై మొత్తం 50 కేసులు ఉన్నాయి. ఈ కేసున్నీ దాదాపు నేరపూరితమైన కేసులే. పోలీసులు ఈ కేసులపై కూడా విచారణ చేపట్టారు. ఒక్కో కేసును బయటకు తీసి, చింతమనేని నేరాల చిట్టాను బయటపెట్టే అవకాశం ఉంది. దీంతో వరుసగా కేసులు, విచారణలతో చింతమనేని ఉక్కిరిబిక్కిరి అవడం ఖాయం. ఈ నేపథ‌్యంలో మళ్లీ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా వరుస కేసులు, విచారణతో చింతమనేనికి పర్మినెంట్‌గా చిప్పకూడు తప్పేలా లేదు అంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో రెచ్చిపోయిన చింతమనేనికి ఈ శాస్త్రి జరగాల్సిందే అంటూ దెందులూరు ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు.