ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ కలహాలే కోడెల ఆత్మహత్యకు దారి తీసిందా అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. ఇక కోడెల ఇంతకు ముందు కూడా ని ద్రమాత్రలు మింగి..ఆత్మహత్యకు పాల్పడితే..కుటుంబ సభ్యులు గుండెపోటుగా చిత్రీకరించడంపై కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు.. కోడెల దశదిన కర్మలన్నీ జరిగాక.. ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్‌మెంట్ కీలకం కానుందని పోలీసులు అంటున్నారు.. అలాగే కోడెల ఫోన్‌లోని కాల్‌డేటాపై ఆరా తీస్తున్నామన్నారు. కోడెల ఆత్మహత్యకు చివరి రోజుల్లో ఎవరెవరికి కాల్ చేశారు..ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శివరాంను తెలంగాణ పోలీసులు విచారించనున్న నేపథ్యంలో కోడెల ఆత్మహత్య వెనుక అసలు కారణాలు బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా రాజకీయంగా వత్తిళ్లు, చంద్రబాబు నిరాదరణ, కుటుంబ కలహాలు కోడెల ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయని ఆయన అనుచరులు, నరసరావుపేట ప్రజలు అంటున్నారు.