గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 మంది సభ్యులున్న బోర్డును మేనేజ్ చేయడమే సమస్యగా ఉండేదని…ఇప్పుడు 29 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త బోర్డుతో ఛైర్మన్, ఈవో ఎలా నెగ్గుకొస్తారో అంటూ ట్వీట్ చేశారు. టీటీడీ బోర్డులో ఆధ్యాత్మిక, భక్తి భావం ఉన్నవాళ్లు ఉండాలని అనుకుంటే..అది ఏ నాడు జరగలేదని అన్నారు.. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై కూడా ఐవైఆర్ స్పందించారు. టీటీడీ బోర్డుపై తానేమంటానన్న ఆసక్తి తెలుగుతమ్ముళ్లలో నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా టీటీడీ బోర్టుపై మాజీ సీయస్ ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
