ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 13పేజీల నివేదికను అందజేశారు.ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
కోడెల ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే కారణమని, ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 అక్రమ కేసులు పెట్టారని, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వెల్లడించారు. కోడెల ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు వంటి వాటిపై గవర్నర్‌కు నేతలు వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, ఇతర నాయకులు ఉన్నారు. డీజీపీకి రెండు పుస్తకాలు అందజేసినా ఫలితం లేదని, చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.