తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత ఆదివారం గోదావరిలో మునిగిన బోటు ప్రమాదానికి సంబంధించి బుధవారం మరో 6 మృత దేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద ఐదు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువులకు అప్పగించారు. బుధవారంతో కలిపి ఇప్పటివరకు 34 మృతదేహాలు లభించినట్టయ్యింది. బోటులో మొత్తం 73 మందికి 26మంది బయటపడగా, ఎనిమిది మృతదేహాలు తొలి రోజునే లభించాయి. 39మంది గల్లంతైనట్టు గుర్తించి, గాలింపు చేపట్టారు. రెండవరోజు సోమవారం ఫలితం లేకపోగా, మూడోరోజు మంగళవారం వివిధ ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభించాయి. బుధవారం నాటి ఆరుతో కలిపి సంఖ్య 34కు చేరింది. ఇంకా 13మంది ఆచూకీ తెలియాలి.
అయితే బోటు ప్రమాదం సంభవించి నాలుగురోజులు కావడంతో మృతదేహాలన్నీ ఉబ్బిపోయి బాగా పాడైన స్థితిలో నీటిపై తేలుతూ కనిపిస్తున్నాయి. తేలుతున్న మృతదేహాలను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చి, రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. పోస్టుమార్టం అనంతరం అక్కడినుంచి మృతదేహాలను అంబులెన్స్ లలో అధికారులు స్వస్థలాలకు పంపిస్తన్నారు. బుధవారం లభించిన ఆరు మృతదేహాలు వరంగల్‌కు చెందిన దోమల హేమంత్ (28), కర్నూలు కు చెందిన వాసిరెడ్డి మహేశ్వరరెడ్డి (39), వరంగల్ జిల్లా కడిపి కొండకు చెందిన రాజేంద్రప్రసాద్ (42), కృష్ణాజిల్లా అప్పనవీడుకు చెందిన శ్రీనివాస్ (21), హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ తాసిఫ్ (25), విశాఖజిల్లా గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్డి దాలమ్మలు (40)గా అధికారులు నిర్ధారించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ బుధవారం ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోస్టుమార్టం త్వరితగతిన పూర్తిచేసి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.