నిన్న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలం నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం నుండి..చంద్రబాబు, లోకేష్‌తో సహా పలువురు నేతలు, కార్యకర్తలు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గుంటూరుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు, లోకేష్‌తో సహా ఇతర ముఖ్య నేతల అంతా కోడెల మృతదేహంతోపాటు ఉన్నారు. మరికాసేపట్లో గుంటూరులోని రాష్ట్ర కార్యాలయానికి కోడెల పార్ధీవ దేహం చేరుకోనుంది.. మార్గ మధ్యంలో పార్టీ శ్రేణులు కోడెల మృత దేహానికి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం వరకు కోడెల భౌతికదేహాన్ని, బుధవారం ఉదయం నరసరావుపేటకు ర్యాలీగా తరలించి.. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడెల అంత్యక్రియల సందర్భంగా నరసరావుపేటలో విషాదం నెలకొంది. తమ అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానుండడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
