తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు..
మైనింగ్ ద్వారా 2014-15లో రూ.1,968.26 కోట్లు, 2015-16లో రూ.2,369.71 కోట్లు, 2016-17లో రూ.3,169.70 కోట్లు, 2017-18లో రూ.3,431.16 కోట్లు, 2018-19లో రూ.4,848.85 కోట్లు, 2019లో ఆగస్టు వరకు 876.74 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 16,937 కోట్లు ఆదాయంతో 130 శాతం పురోగతి సాధించామని పేర్కొన్నారు. గతంలో నాన్‌వర్కింగ్ లీజులు 965 ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక 622 లీజులను రద్దుచేశామనిచెప్పారు.
ఇసుకపై 2007 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రూ.39.60 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన చర్యలతో ఆదాయం ఏడువేల శాతం పెరిగి రూ.2,842 కోట్లకు చేరినట్టు వివరించారు. గతంలో ఈ ఆదాయం ఎక్కడికిపోయిందో కాంగ్రెస్ సభ్యులే ఆలోచించుకోవాలని ఎత్తిపొడిచారు. గిరిజన ప్రాంతాల్లోనూ తప్పుడు సొసైటీలను రద్దుచేశామని, 33 గిరిజన సహకారసంఘాల ఏర్పాటుతో మొత్తం 11,332 కుటుంబాలకు రూ.83 కోట్ల ఆదాయం ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.