మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తలను కోట్టి పారేస్తున్నారు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు. కోడెల కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు.
ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్ నంబర్ 9848005923 నుంచి తన నంబర్ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కంచేటి సాయిబాబు కోరారు.