తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిన్న ఉదయం 9గంటల వరకు కోడెల చంద్రబాబతో భేటీకి ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తి అన్నారు.
కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘ఏ కేసులోను ప్రభుత్వం కోడెలకు, ఆయన కొడుకు, కుతుర్లకు ఎలాంటి నోటీస్‌లు ఇవ్వలేదని, ఆయన్ని చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారన్నారు. కోడెలను పార్టీలో దూరం పెట్టారని, ఫర్నిచర్ కేసులో వర్ల రామయ్యతో విమర్శలు చేయించారన్నారు. 1999 లో బాంబుల కేసు విచారణ చేసి అవమానించింది చంద్రబాబు కాదా..? అన్నారు. 2014లో నరసరావుపేట సీటు కాదని సత్తెనపల్లి పంపి అవమానించింది చంద్రబాబు కాదా.? అని ప్రశ్నించారు.
మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా? పల్నాడు పులి అని ఈరోజు చెప్తున్న చంద్రబాబు కోడెలను పల్నాడు రాకుండా ఎందుకు అడ్డకున్నారు. ఇప్పుడు కోడెల మృతదేహం వద్ద కూర్చుని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్‌ని కూడా ఇలానే క్షోభకు గురి చేసి చంపించి తరువాత శవం వద్ద మొసలి కన్నీరు కార్చారన్నారు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారని తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటా విచారించాలి, ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని నాని డిమాండ్ చేసారు.