టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై నిన్న కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సిబ్బందిని విచారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 కు కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గత రెండు రోజులుగా ఆయన ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి..ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల చివరిసారిగా ఓ వ్యక్తితో 24 నిమిషాలసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ 24 నిమిషాల కాల్‌లో అవతలి వ్యక్తికి, కోడెలకు మధ‌్య తీవ్ర వాగ్వివాదం నడిచినట్లు పనివాళ్లు చెబుతున్నారు. ఆ కాల్ చేసిన అనంతరం కోడెల ముభావంగా కనిపించారని, కాసేపటి తర్వాత తన గదిలోకి వెళ్లినట్లు సమాచారం. 10 గంటల సమయంలో ఆయన భార్యకు అనుమానం వచ్చి గది తలుపులు కొట్టడంతో ఎంతకీ తీయకపోవడంతో గన్‌మెన్ వెనక నుంచి వెళ్లి తలుపులు తీయగా..కోడెల ఉరివేసుకుని కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, వ్యక్తిత సిబ్బంది కోడెల బసవతారకం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ..మరణించారు. అయితే కోడెల చివరిసారిగా మాట్లాడిన 24 నిమిషాల కాల్..ఆయన ఆత్మహత్యకు దారి తీసిందా..అన్న అనుమానాలు వస్తున్నాయి. కాగా కోడెల పర్సనల్ ఫోన్ మిస్సింగ్ అయినట్లు ఆయన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐసీపీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే కోడెల ఫోన్ సాయంత్రం 5 గంటలకు మిస్ అయినట్లు పోలీసులకు గుర్తించారు. దీంతో ఆయన ఫోన్‌ను ఎవరైనా కావాలని కొట్టేయించారా..లేదా దాచారా అన్న విషయం తేలాల్సి ఉంది. మొత్తంగా కోడెల చివరిసారిగా మాట్లాడిన 24 నిమిషాల కాల్..ఆయన ఆత్మహత్యకు దారి తీసి ఉంటుందని..పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంతకీ ఆ 24 నిమిషాల పాటు కోడెల ఎవరితో మాట్లాడారు..కోడెల పర్సనల్ ఫోన్‌ను ఆయనతో మాట్లాడిన వ్యక్తే మాయం చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.