అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ చివరినాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికల్లా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి నవంబర్ నాటికి భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.
గ్రామసచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కు ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు. డిసెంబర్ నుంచి కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే ఉండాలని, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితా బోర్డులో పెట్టాలన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా అక్కడ ఉండాలని ఆదేశించారు. వైయస్‌ఆర్ కంటివెలుగు పథకం కింద 5.3కోట్ల మందికి పరిక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. మొత్తం రూ.560 కోట్లతో వైయస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని, స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలను ప్రభుత్వమే దగ్గరుండి నిర్వహిస్తుందన్నారు.