ఇటీవలి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ఫ మెజారిటీతో గట్టెక్కిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ… వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్ట్ విచారణ జరిపింది.. ఈ కేసులలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం హైకోర్ట్ నోటీసులిచ్చింది. ఈ కేసులలో తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వల్ఫ మెజారిటీతో గట్టెక్కిన గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్‌లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా గెలిచిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వాటిని పొందపర్చలేదని, అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్‌రెడ్డి హైకోర్ట్‌కు వివరించారు. నిబంధనల ప్రకారం గెలుపొందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నికల చెల్లదు కావున వారిని అనర్హలుగా ప్రకటించాలని పిటీషనర్ల తరపున న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ కేసుపై స్పందించిన హైకోర్ట్ ఈ మేరకు సమాధానం ఇవ్వాల్సిందిగా గంటా, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ రావులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ముగ్గురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను కోర్టుకు సమర్పించాలంటూ..ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు కూడా హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీంతో గంటా శ్రీనివాస్‌రావు, అనగాని సత్య ప్రసాద్, గద్దె రామ్మోహన్ ల ఎన్నికపై సందిగ్ధం ఏర్పడింది. ఒక వేళ నిబంధనలు ప్రకారం అఫిడవిట్లు లేకపోతే..ఈ ముగ్గురి ఎన్నికల చెల్లదని హైకోర్ట్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది . అదే జరిగితే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కన్నప్పరాజు, మోపిదేవి, బొప్పన భవకుమార్‌లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతారు. దీంతో ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలతో కుదేలైన టీడీపీ మరో ముగ్గురిని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో హైకోర్ట్ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.