ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్‌తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం చేశారు. కోడెలతో తనకు ఎంతో అనుబంధం ఉన్నది..సమస్యలు ఉంటే పోరాడుదామని చెప్పానని..ఇలా ఆత్మహత్యకు పాల్పడుతారని ఊహించలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు వెళ్లి కోడెల భౌతికకాయాన్ని తీసుకువచ్చి రేపు అంతక్రియల్లో పాల్గొంటానని చంద్రబాబు తెలిపారు. తాజాగా కోడెల మరణంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కోడెల శివప్రసాద్ రావు గారు రాజకీయంగా అంచెలంచెలకు ఎదిగి, శాసనసభ్యునిగా, మంత్రిగా, స్పీకర్‌గా ఉన్నత పదవులు అలంకరించారు. అయితే రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక ఆయన తుది శ్వాస విడవటం నన్ను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది.తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఆపత్కాల సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. నా తరపున, జనసేన శ్రేణుల తరపున తీవ్ర సంతాపవం వ్యక్తం చేస్తున్నాని పవన్ కల్యాణ్ తెలిపారు.ఈ మేరకు జనసేన పార్టీ ప్రెస్‌నోట్ విడుదల చేసింది.