ఉస్మానియా ఆసుపత్రిలో ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. రేపు నరసరావుపేటలో కోడెల అంతక్రియలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని బసవతారకం ఆసుపత్రి నుంచి ఉస్మానియాకు తరలించారు. కొద్ది సేపటి క్రితం కోడెల భౌతికకాయానికి ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి ట్రస్ట్‌భవన్‌లోనే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదుగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. రేపు జరుగనున్న కోడెల అంత్యక్రియల్లో చంద్రబాబు, లోకేష్‌లతో సహా నరసరావుపేట, సత్తెనపల్లికి చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొననున్నారు. రేపు కోడెల అంత్యక్రియల నేపథ‌్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా..పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
