మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ నందిని సిద్దారెడ్డి మాతృమూర్తి రత్నమ్మ మరణం నేపథ్యంలో సిద్దారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో పక్కనే జరుగుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, వేములఘాట్ లలో జరుగుతున్న పనులను చూసి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 22.6 కిలోమీటర్లు రిజర్వాయరు పొడవు, మొత్తం నీటి నిలువ సామర్ధ్యం 50 టీఎంసీలని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “రిజర్వాయర్ పూర్తయి నీటిని నిలువ చేస్తే మూడేళ్లలో చుట్టూ 25 కిలోమీటర్లు భూగర్భజలాలు పెరిగి సస్యశ్యామలం అవుతుంది. కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ కేసీఆర్ గారి కలలపంట. రైతుల ఆశలపంట ఈ రిజర్వాయర్ తో హైదరాబాద్ కు భవిష్యత్ లో నీటికొరత అన్నది ఉండదు. భవిష్యత్ తెలంగాణ బాగుకొరకే కేసీఆర్ గారి ప్రణాళికలు. వారి ముందుచూపు ఫలితంగానే తెలంగాణ ఐదేళ్లలో దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా అగ్రభాగాన నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ గారి పట్టుదలకు నిదర్శనం” అని అన్నారు.