ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం లైఫ్ జాకెట్లు తీసేసిన సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. గోదావరి నది చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ప్రమాదాలలో ఇది రెండోది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించారు. హెలికాఫ్టర్లు, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలను రంగంలోకి దించారు. రాత్రి సైతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇందులో బాగంగా బోటు ప్రమాద బాధితులను పరామర్శిచేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రమాద స్థలికి వెళ్లనున్నారు. అమరావతిలో ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన దేవీపట్నం వెళతారు. నదిలో గాలింపు చర్యలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో పాటుగా విపత్తు నిర్వహణా సిబ్బందితో సమావేశం అవుతారు. స్థానిక అస్పత్రుల్లో చికిత్సి పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. వెంటనే బోటు అనుమతులు సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా విపత్తు నిర్వహణల శాఖ ఎప్పటి కప్పుడు ఘటనా స్థలిలో జరుగుతన్న చర్యల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. దీని పైన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ముందుగా సహాయక చర్యలు..మునిగిన బోటును వెలికి తీసిన తరువాత ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే..ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటన మీద సీరియస్ గా ఉన్నారు.