ఇవాళ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు భౌతికకాయానికి మరి కాసేపట్లో పోస్ట్‌మార్టం జరగనుంది. కోడెల మరణంపై వివాదం నెలకొన్న దరిమిలా..రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు గన్‌మెన్, డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది నుంచి పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీశారు. సోమవారం ఉదయం కోడెల అస్వస్థతకు గురికావడంతో ఆయన్ని 11.15 గంటలకు డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. కాగా కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేయగా, వైసీపీ ప్రభుత్వం వేధింపులవల్లే..ఆయన ఉరివేసుకుని చనిపోయినట్లు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలది ఆత్మహత్య చేసుకున్నారా? గుండెపోటుతో మరణించారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపటిలో కోడెల భౌతికకాయానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోలీసులు కోడెల భౌతికకాయాన్ని బసవతారకం ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కోడెల మరణంపై తలెత్తుతున్న అనుమానాలు నివృతి అయ్యే అవకాశం ఉంది.
