తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. హైదరాబాదుకు చెందిన జానకి రావు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు బ్రేక్ ఫాస్ట్ చేసి అందరం ఉన్నామని మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని సిబ్బంది తెలిపిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.. ప్రమాదానికి ముందే ఇది డేంజర్ జోన్ బోటు ఒరుగుతుంది.. ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పారని తెలిపారు. ఇలా చెప్పిన వెంటనే ఒక్కసారిగా పక్కకు ఒరిగి ఉందని దీంతో ప్లాస్టిక్ కుర్చీ లో కూర్చుని ఉన్న వారంతా ఓ వైపు వచ్చేశారు.. ఒకవైపు బరువు ఎక్కువ కావడంతో బోటు తిరిగి యథాస్థానానికి రాలేకపోయిందన్నారు.
ఈసమయంలో మొదటి అంతస్తులోని వారంతా ఒక్కసారిగా భయంతో రెండో అంతస్తుల వెళ్లాలని ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ తప్పిదమా.. బోటు ఒరిగిపోవడమా అనేది తనకు తెలియదన్నారు. తాను శవాసనం ద్వారా ప్రాణాలతో బయటపడ్డానని, తనభార్య, బావమరిది, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. మరో సాక్షి వరంగల్ జిల్లా కాజీపేట నుంచి వెళ్ళిన గొర్రె ప్రభాకర్ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు.. తాము మొత్తం 14 మంది వచ్చామని.. ఒక్కసారిగా లాంచి పక్కకు మునిగిపోయిందని తెలిపారు. అక్కడికి బోటులో వచ్చినవారు తనను రక్షించారని, తన కళ్ళముందే చాలామంది నీటిలో మునిగిపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం బోటులో 70 మంది ఉండగా 60మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రమాదఘటనలో తొమ్మిది మంది చనిపోగా 27మంది సురక్షితంగా బయటపడ్డారు మరో 24 మంది గల్లంతయ్యారు.. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.