తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌లపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు చేయలేదు. మీడియా ముందుకు కూడా సరిగా రాలేదు. చంద్రబాబు, లోకేష్‌లపై కూడా ఇదివరకులా పెద్దగా స్పందించింది లేదు. కానీ జగన్ వంద రోజుల పాలనపై విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ ఇంకా ప్యాకేజీలు తీసుకుంటూ ఇంకా చంద్రబాబుకే పని చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు వివరాల్లోకి వెళితే..నిన్న జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించాడు. పారదర్శకత, దార్శనికత లోపించిన జగన్ 100 రోజుల పాలన అంటూ ఓ బుక్ విడుదల చేసిన పవన్ వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సంవత్సరం వరకు జగన్ పాలనపై మాట్లాడే అవకాశం తనకు రాదనుకున్నానని, కానీ మూడునెలల్లోపే వైసీపీ పాలనపై మాట్లాడే అవకాశం కల్పించారంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయని పవన్ అన్నాడు. వైసీపీ సంక్షేమ పథకాలు బాగానే ఉన్నా..వాటి అమలులో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు. జనరంజకమైన జనవిరుద్ధ పాలనగా వైసీపీ పాలనను అభివర్ణించారు. నవరత్నాలు జనరంజకమైనవే ఆయన.. వాటిని జనవిరుద్ధంగా అమలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ ఇంకా చంద్రబాబు మనిషిగానే మాట్లాడుతున్నారని, టీడీపీ స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా జనసేనాని ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. వందరోజుల జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామని రోజా చెప్పారు. వంద రోజులు కూడా కాకముందే జగన్ పాలనపై పుస్తకం విడుదల చేసిన పవన్ కల్యాణ్.. . గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలోని అవినీతి, అక్రమాలపై ఎందుకు పుస్తకం విడుదల చేయలేదని రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, ఎల్లోమీడియా..ఇలా ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆమె ధీమా వ్యక్తం చేసింది. గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేశారని. ఇప్పుడు ప్యాకేజీ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్‌తో విమర్శలు చేయిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో పవన్ కల్యాణ్ విడుదల చేశారని ఆమె ఆరోపించారు. ప్యాకేజీలు తీసుకొని పవన్ ఇంకా చంద్రబాబుకే పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. రోజా వ్యాఖ్యలపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పవర్‌స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని, బాస్ చంద్రబాబు ఆదేశిస్తే బానిస పవన్ పాటిస్తాడంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సైటైర్లు వేస్తున్నారు. మొత్తంగా జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని విమర్శలకు ఎమ్మెల్యే రోజా ఇచ్చిన కౌంటర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.