టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల పలు విప్లవాత్మక మార్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు, వయోవృద్ధులకు 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇవాళ తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపులను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ మరుగుదొడ్ల విషయంలో పరిశుభ్రంగా ఉండాలని సూచిచారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మరుగుదొడ్ల లోపల, బయట బ్లీచింగ్ వేయించాలని అధికారులకు ఆదేశించారు. తిరుమలకు వెళ్లే భక్తులతో మాట్లాడుతూ…మెట్ల మార్గంలో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారు. ఇక అక్కడ ఉన్నటువంటి వర్తకులతో మాట్లాడుతూ ఆహార పదార్ధాలన్ని పరిశుభ్రంగా , ఎంపీఆర్‌పీ ధరలకే అమ్మాలని ఆదేశించారు. మొత్తంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ మెట్ల మార్గంలో తనిఖీలు చేపట్టానని, ఎవరికి ఏ అసౌకర్యం కలిగినా..తన కార్యాలయంలో ఫిర్యాదు చేయావల్సిందిగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
