Home / TELANGANA / ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!

ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!

ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్‌‌గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో  యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రశాంతమైన నల్లమల అడవుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. యురేనియం కొనగలుగుతాం కానీ..అడవులను కొనగలుగుతామా అంటూ..విజయ్‌దేవరకొండ, సమంత వంటి సినీ స్టార్స్‌తో పాటు సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలతో పాటు ఆదివాసీ ప్రజలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడనున్నాయి. భయంకరమైన విధ్వంసం జరుగనుంది. జీవ వైధవ్యం దెబ్బతిని మానవ మనుగడే ప్రశ్నార్థం కానుంది.  జీవజాతులు అంతరించిపోనున్నాయి.    ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా..ఈ  యురేనియం తవ్వకాల వల్ల ఎదురయ్యే దుష్పలితాల గురించి తెలుసుకునే ముందు నల్లమల అడవుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం.

తూర్పు కనుమలలో భాగంగా కృష్ణా , పెన్నా నదులకు మధ్యన, ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. మేర ఈ దట్టమైన నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాల కొద్ది మేర ఈ నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరపు అడగులలో సుమారు మూడవ వంతు అంటే 3728 కి.మీ. మేర దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. పులులు సమృద్దిగా ఉన్నఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించారు.  ఇక  W నల్లమల అడవుల్లో మారేడు, నేరేడు, ఉసిరి, కరక్కాయ, కుంకుడుకాయ, అశ్వగంధ, పిల్లితీగలు, నేలవాము, నేల ఉసిరి, గన్నేరు గడ్డలు వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. ఇక శ్రీగంధం, జిట్రేగి, తెల్లమద్ది, సండ్ర వంటి అరుదైన వృక్షాలు..టేకు, మామిడి, సుబాబుల్‌, మద్ది, వేప, ఎగిస, బండారు, చిరంజి, తపసి, నల్లమద్ది వంటి ..కలపజాతి వృక్షాలు, రావి, మర్రి, చింత, కానుగ, రేల, బూదగ, ముల్లెంజాతి వెదురు వంటి ఇతర రకాల వృక్షాలు  విస్తరించి ఉన్నాయి. ఇక జంతుజాలం గురించి వస్తే..   బెంగాల్ టైగర్, చీతా, అడవి పందులు, దుప్పి, ఎలుగుబంటి, అడవి కుందేలు, నక్కలు, నీలగాయ్‌, సాంబార్ డీర్, చుక్కల జింక, మౌస్‌డీర్‌, కొండ గొర్రె మొదలైన జింకలు, అడవి పిల్లులు, రాచ ఉడతలు, చారల హైనా, రాక్ పైథాన్ వంటి జంతువులు, 80 జాతులకు పైగా పక్షులు ఉన్నాయి. ఈ నల్లమల అడవుల్లో జనజీవనం చాలా తక్కువ. సుమారు 120 చెంచుపెంట‌ల్లో 10 – 12 వేల మంది చెంచులు మనుగడ సాగిస్తున్నారు. ముఖ్యంగా నల్లమల అడవుల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. క్వార్‌జైట్, సాండ్ స్టోన్, యురేనియం, వజ్రాలు వంటి ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

యురేనియం వల్ల ఎదురయ్యే దుష్పలితాలు :

 

యురేనియం అనేది ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఈ  మూలకానికి అణుభారం చాలా ఎక్కువ. ఏడు కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయవచ్చు. దీన్ని బట్టి యురేనియం శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. కాగా యురేనియంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. కానీ విద్యుత్ పేరుతో అణుబాంబుల తయారీకి యురేనియం తవ్వకాలు చేపడుతున్నట్లు పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో భయంకర విధ్వంసం జరిగే అవకాశం ఉందనేది వాస్తవం.

ఇటీవల తెలంగాణ ప్రాంత నల్లమల అడవిలోని, రాతి పొరల్లో అట్టడుగు భాగాన యురేనియం నిక్షేపాలు దాగి ఉన్నట్లు..కనుగొన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ త్రవ్వకాలకు సన్నద్ధమైంది. గతంలోనే కేంద్ర  ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా..యురేనియం ఖనిజాల కోసం రహస్య సర్వేలు ఎన్నో నిర్వహించింది. తాజాగా తెలంగాణలో దేశంలోనే అతిపెద్దదిగా గుర్తించబడిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్న నాణ్యమైన యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ డీబీయస్ కంపెనీ వారు ఇప్పటికే 430 బోర్లు వేశారు. ఇంకా 4 వేల పై చిలుకు బోర్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రజలకు అనుమానం వచ్చి బోర్ల వాహనాలను ధ్వంసం చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ యురేనియం తవ్వకాలు ఫలితంగా పర్యావరణం దెబ్బతిని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు ఆరోగ్య రీత్యా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

ఈ యురేనియం తవ్వకాలతో నల్లమల అడవుల్లోని చెంచుల ఉనికి ప్రశ్నార్థం అవుతుందని, పరోక్షంగా 83కి.మీ పరిధిలోని గ్రామాలపై దుష్ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక్కడి ఆధ్యాత్మిక క్షేత్రాలు పూర్తిగా తమ ప్రాముఖ్యతను కోల్పోనున్నాయి. ముఖ్యంగా యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత జీవుల శరీరాల్లోకి చేరి ఎముకల్లో స్థిరపడుతుంది. తద్వారా ఎముకల, ఊపిరితిత్తుల క్యాన్సరు, రకరకాల చర్మవ్యాధులు, జన్యుసంబంధమైన వ్యాధులు, ప్రబలే ప్రమాదం ఉ్దంది. సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది. ఇక యురేనియం శుద్ధితో కృష్ణా జలాలు కలుషితమవుతాయని, శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజల భవిష్యత్తులో యురేనియంతో కలుషితమైన నీటిని తాగే ప్రమాదం ఏర్పడుతోంది.

ఇప్పటికే జార్కండ్ రాష్ట్రంలో యురేనియం తవ్వకాల వల్ల జరుగుతున్న దుష్పలితాలను చూస్తున్నాం.  రేడియేషన్ ప్రభావంతో  పిల్లలు వింత ఆకృతులతో జన్మిస్తున్నారు. అక్కడి ప్రజలంతా క్యాన్సర్ మహమ్మారికి బలైపోతున్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భయంకర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. మానవ మనుగడకు, ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతున్న ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిద్దాం..నాగరికతకు ఆనవాళ్లుగా మిగిలిన నల్లమల అడవులను కాపాడుకుందాం…నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, ప్రజలంతా కలిసి..చెంచుల పోరాటాలకు సంఘీభావం పలుకుదాం. నల్లమల అడవులపై సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్‌కు స్పందించిన తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైతేనేం మానవ మనుగడకు ప్రమాదకరమైన ఈ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సేవ్ నల్లమల..సేవ్ ఎన్విరాన్‌మెంట్..స్టాప్‌యురేనియంమైనింగ్..అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేద్దాం…కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలు నిలిపే వరకు పోరాడుదాం…తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అమెజాన్ గా పేరుగాంచిన నల్లమల అడవులను కాపాడుకుందామని దరువు.కామ్ పిలుపునిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat