జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ హామీలు జనరంజకంగా ఉన్నా పాలన జన విరుద్దంగా సాగుతోందని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కూడా నిర్మాణ రంగం కూడా తీవ్రంగా కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందంటూ కామెంట్ చేసారు. ఏపీ లో వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 50వేలకోట్లు కావాలని చెప్పుకొచ్చారు.
గత పాలనలో తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని కానీ, ఏపీ భవిష్యత్ ను డోలాయమానంలోకి నెట్టకూడదని అన్నారు. పీపీఏల విషయంలో జగన్ ఎవరుచెప్పినా వినకుండా మొండిగా వెళ్తున్నారని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి గౌరవించాల్సింది పోయి పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ ముందుకురాకుండా చేస్తున్నారని విమర్శించారు. కియో సీఈవోను స్థానిక వైసీపీ నేతలు అవమానించారని పెట్టుబడులు ఇంకా ఎలా వస్తాయని ప్రశ్నించారు. బ్యాంకు రుణాలు ఇవ్వమని చెబుతుంటే కనీసం ప్రయత్నం చేయట్లేదన్నారు. మరి పధకాల అమలుకు డబ్బులు ఎక్కడినుండి తెస్తారని ప్రశ్నించారు. మీరు దాచిన లక్ష కోట్లు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడతారా అంటూ జగన్ ని పవన్ ప్రశ్నించారు. జగన్ పాలనలో విజన్ లేదన్నారు.